కార్తీక మాసంలో వచ్చే షష్ఠి తిథి సంతానం కోరుకునే దంపతులకు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్ 15న ఈ పవిత్రమైన రోజు వచ్చింది. ఈ ఏడాది వివాహం అయిన కొత్త జంటలు, జాతకంలో సర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉన్నవారు ఈ పూజా నియమాలు పాటించాలని పురాణాలు పేర్కొంటున్నాయి.

ఆ రోజు తెల్లవారుజామునే లేచి సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. దగ్గరలోని నదులలో స్నానం చేయడం మంచిదని పండితులు తెలిపారు. దంపతులిద్దరూ కలిసి సంతాన ప్రాప్తి కోసం సంకల్పం చెప్పుకోవాలి.

ఇంట్లో తులసికోట వద్ద, దేవుడి మందిరంలో ఆవునేయి దీపం వెలిగించాలి. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని, కార్తీక దామోదరుడిని అర్చించి పసుపు, కుంకుమ, ఆరు రకాల పూలతో పూజించాలి. స్వామికి పాలు, తేనె, అరటిపండ్లు సమర్పించి "ఓం శరవణభవాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

శివాలయానికి వెళ్లి బ్రహ్మచారి అర్చకునికి దక్షిణతో పాటు ఎర్ర గడుల కండువాను దానం చేయాలి. దంపతులిద్దరూ ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన తర్వాత సాత్విక ఆహారం తీసుకోవాలి. ఆ రోజు రాత్రి నేలపై చాప వేసుకొని పడుకోవాలి.

ఈ పూజ చేయడం వల్ల సంతాన యోగం తొందరగా కలుగుతుందని, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. సర్పదోషాలు తొలగి ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుందని ఈ పూజా విధానం వివరిస్తోంది.