మహారాష్ట్రలోని నాసిక్‌లో సృష్టించిన టీసీఎస్ మతమార్పిడి కేసులో ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలైన మాజీ టీసీఎస్ ఉద్యోగి నిదా ఖాన్‌కు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలతో పాటు, కోర్టు జారీ చేసిన సమన్లను పట్టించుకోకపోవడంతో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో మతీన్ పటేల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, విచారణ నిమిత్తం నాసిక్‌కు తరలించారు.

అరెస్ట్ జరిగిన వెంటనే అధికారులు మతీన్ పటేల్ నివాసం, కార్యాలయాలపై బుల్డోజర్లతో చర్యలు చేపట్టారు. ఆయన ఆఫీసు, ఇంటిని నేలమట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.

2022లో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో, సహోద్యోగి దానిష్ షేక్ పెళ్లి పేరుతో మోసం చేశాడని, అతని సోదరి నిదా ఖాన్ తనను మతం మార్చుకోవాలని వేధించిందని బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిదా ఖాన్ బాధితురాలిని మతం మార్చుకోవాలని ఒత్తిడి చేయడమే కాకుండా, ఆమె మతాన్ని అవమానిస్తూ వ్యాఖ్యలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితురాలికి ఇస్లామిక్ మత గ్రంథాలు అందించడం, హిజాబ్ ధరించేలా ప్రోత్సహించడం, మొబైల్ ఫోన్‌లో మతపరమైన యాప్‌లు ఇన్‌స్టాల్ చేయించడం వంటి ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.

ఈ ఘటనపై బలవంతపు మతమార్పిడి, లైంగిక, మానసిక వేధింపుల కింద మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి. సుమారు 25 రోజుల పాటు పరారీలో ఉన్న నిదా ఖాన్‌ను మే 7న ఛత్రపతి సంభాజీనగర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గర్భవతినని ఆమె కోరడంతో, నాసిక్ కోర్టు గత నెలలో బెయిల్ మంజూరు చేసింది.

మరోవైపు, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను టీసీఎస్ ఇప్పటికే సస్పెండ్ చేసింది. సంస్థలో ఎటువంటి వేధింపులు, వివక్షను సహించేది లేదని, జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తున్నామని టీసీఎస్ స్పష్టం చేసింది.