నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల కోసం అధికారులు శనివారం బుల్డోజర్లతో కూల్చివేతలకు దిగారు. 50 ఫీట్ల మేర రోడ్డు విస్తరణకు గతంలోనే స్థానికులు అంగీకరించగా, ఇప్పుడు 72 ఫీట్ల వరకు విస్తరిస్తామంటూ అధికారులు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
ఈ క్రమంలో స్థానిక చౌరస్తాలో చిన్న హోటల్ నడుపుకునే యాదగిరిగౌడ్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. గతంలోనే తన ఇంటిని కోల్పోయిన యాదగిరి, మిగిలిన స్థలంలో నిర్మించుకున్న ఇంటిని కూడా కూల్చేస్తామనడంతో తన ఇంటి పిల్లర్‌కు ఉన్న వైరుతో ఉరేసుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకున్నారు.
‘ఉన్న గూడు కూల్చేస్తే మేము ఎలా బతకాలి? అభివృద్ధి చేయాలనుకుంటే మా సమాధులపై చేయండి’ అంటూ యాదగిరి రోదించాడు. ప్రభుత్వ నిర్ణయం మేరకు కూల్చివేతలు తప్పవని అధికారులు పేర్కొన్నప్పటికీ, బాధితుడి ఆవేదనతో బుల్డోజర్లను వెనక్కి పంపించారు.
ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వారు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గ పరిధిలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది.
మరోవైపు, ఆత్మహత్యకు ప్రయత్నించిన యాదగిరి కుటుంబాన్ని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. రోడ్డు విస్తరణ పేరుతో జరుగుతున్న ఈ పరిణామాలపై బాధితుల నుంచి వివరాలు సేకరించిన ఆయన, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.







