గాంధీ భవన్‌లో శనివారం జరిగిన కీలక సమావేశంలో పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల భర్తీపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు గుర్తింపునిచ్చేలా ఈ నియామకాలు ఉండాలని వారు నిర్ణయించారు. సిఫార్సులకు తావులేకుండా అర్హులైన వారిని ఎంపిక చేయాలని ఈ సమావేశంలో స్పష్టం చేశారు.

ఈ ప్రక్రియలో భాగంగా ఆదివారం జిల్లాల్లో ఇన్‌ఛార్జి మంత్రులు సమావేశం కావాలని నిర్ణయించారు. ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ కమిటీలు, ముఖ్య నాయకులతో సమన్వయం చేసుకుని, ఆశావాహుల జాబితాను రూపొందించి పిసిసికి పంపాలని మంత్రి తుమ్మల సూచించారు. నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, 60 శాతం పోస్టులను మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులకు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సుమారు 30 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించగా, వారి పదవీ కాలం ఇటీవల ముగిసింది. ఇప్పుడు కొత్తగా ఎంతమందికి అవకాశం కల్పించాలి, ఎంతమందిని కొనసాగించాలనే అంశంపై ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ కలిసి తుది నిర్ణయం తీసుకుంటారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో పాటు దేవాలయ, మార్కెట్ సహకార సంఘాల పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.

జిల్లాల నుంచి వచ్చే ఆశావాహుల జాబితాను పరిశీలించిన అనంతరం, ముఖ్యమంత్రి మరియు పిసిసి అధ్యక్షుడు కలిసి తుది జాబితాను ఖరారు చేస్తారు. వ్యవసాయ పరపతి సహకార సంఘాల (PACS) చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలపై కూడా ఈ సమావేశంలో విధి విధానాలను రూపొందించారు.