అక్కినేని నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తున్న 100వ చిత్రం 'కింగ్ 100'కు సంబంధించి చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. జాతీయ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇస్తున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ ఆదివారం (ఆగస్టు 2) ప్రకటించింది. దేవి శ్రీ ప్రసాద్ 47వ పుట్టినరోజును పురస్కరించుకుని, ఆయనకు స్వాగతం పలుకుతూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
నాగార్జున, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'మన్మధుడు', 'మాస్', 'కింగ్', 'కుబేర' వంటి చిత్రాలు సంగీతపరంగా మంచి గుర్తింపు పొందాయి. ఈ హిట్ కాంబో మళ్లీ 'కింగ్ 100' కోసం ఒక్కటవుతుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున, టబు జంట గతంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన నేపథ్యంలో, వీరిద్దరూ మళ్లీ కలిసి నటిస్తుండటం ఈ ప్రాజెక్టుకు అదనపు ఆకర్షణగా మారింది.
రా. కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నాగార్జున కెరీర్‌లో 100వ సినిమా కావడంతో కథ, సాంకేతిక అంశాల్లో చిత్ర బృందం ఎక్కడా రాజీ పడటం లేదు. మిగిలిన నటీనటులు, విడుదల తేదీ వంటి వివరాలను రాబోయే రోజుల్లో దశలవారీగా ప్రకటించే అవకాశం ఉంది.







