మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. 25 ఏళ్ల ఆశిష్ మగర్, తన ప్రియురాలైన 19 ఏళ్ల విష్ణుమాయతో కలిసి నివసిస్తున్నాడు. ఆగస్టు 25న విష్ణుమాయ మరో వ్యక్తితో ఉండటం చూసిన ఆశిష్, ఆమెపై అనుమానం పెంచుకుని గొడవకు దిగాడు.

గొడవ తర్వాత ఆశిష్ విషం కలిపిన కూల్ డ్రింక్‌ను విష్ణుమాయకు ఇచ్చాడు. అది తాగిన వెంటనే ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మరణించే ముందు తాను ఆశిష్ ఇచ్చిన కూల్ డ్రింక్ తాగినట్లు విష్ణుమాయ కుటుంబ సభ్యులకు చెప్పింది.

పోస్టుమార్టం నివేదికలో విషం సేవించడం వల్లే ఆమె మరణించినట్లు తేలడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆశిష్ మొదట బుకాయించేందుకు ప్రయత్నించినప్పటికీ, లభించిన ఆధారాలతో పోలీసులు అతడిని నిందితుడిగా నిర్ధారించారు. మృతురాలు రెండున్నర నెలల గర్భవతి అని పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో ఆశిష్ మగర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, అతడిని కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడిని ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.