హీరో పాత్ర బలంగా ఉండాలంటే విలన్ పాత్ర కూడా అంతే శక్తివంతంగా ఉండాలని అంటుంటారు. అయితే, తమ ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో చాలా మంది స్టార్ హీరోయిన్లు విలన్ పాత్రలు చేయడానికి ముందుకు రారు. కానీ, టాలీవుడ్ నటి రెజీనా మాత్రం ఇలాంటి పాత్రల పట్ల ఆసక్తి చూపిస్తోంది.
రెజీనా ఇప్పటికే 'ఎవరు', 'విడామయూర్చి' వంటి సినిమాల్లో విలనిజం పండించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె మరోసారి అలాంటి పాత్రలో కనిపించేందుకు సిద్ధమైంది. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మూకుత్తి అమ్మన్ 2' చిత్రంలో రెజీనా ప్రతినాయకిగా నటిస్తున్నట్లు సమాచారం.
2020లో విడుదలైన 'మూకుత్తి అమ్మన్' మొదటి భాగం మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించగా, ఇప్పుడు వస్తున్న సీక్వెల్ అంటే రెండో భాగానికి సుందర్.సి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నయనతారతో పాటు ఊర్వశి, స్నేహా, యోగిబాబు, దునియా విజయ్ వంటి నటులు కూడా నటిస్తున్నారు.
ఈ సినిమాలో రెజీనా పోషిస్తున్న విలన్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, ఆమె గెటప్ కూడా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు మడోన్నా అశ్విన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా రెజీనా ఒక కీలక పాత్రలో కనిపించనుంది.








