ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం విషమించినట్లు ఇజ్రాయిల్ మీడియా కథనాలు వెలువరించాయి. ఇరాన్ ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఛానల్ 14 ఈ సమాచారాన్ని ప్రసారం చేసింది. ప్రస్తుతం ఇరాన్ ఉన్నత స్థాయి అధికారుల వద్ద మొజ్తాబా ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, మొజ్తాబా ఖమేనీ ఆ బాధ్యతలను చేపట్టారు. అయితే, అదే దాడిలో మొజ్తాబా కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఫిబ్రవరి 28 నాటి దాడి తర్వాత ఆయన ఆచూకీ ఎవరికీ తెలియకుండా పోయింది. అప్పట్లోనే ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ఆయనను గుర్తించడం కష్టమని వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం మొజ్తాబా రహస్య ప్రదేశంలో చికిత్స పొందుతున్నారని సమాచారం. అక్కడి నుంచే ఆయన ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే, మొజ్తాబాతో నేరుగా మాట్లాడే అవకాశం చాలా తక్కువగా ఉందని ఇరాన్ అధ్యక్షుడు మాసౌద్ పెజెష్కియాన్ తెలిపారు.

మొజ్తాబా ఖమేనీ మరణ వార్తను త్వరలోనే విన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని జెరుసలాం పోస్టు తన కథనంలో పేర్కొంది.