మొబైల్ ఫోన్‌ను నిరంతరం మన దగ్గరే ఉంచుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు, భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ సామర్థ్యం తగ్గి, ఫోన్ పనితీరు దెబ్బతింటుంది. ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ను ఛార్జర్‌పైనే ఉంచడం సురక్షితం కాదు.

నిద్రపోయేటప్పుడు దిండు కింద ఫోన్ పెట్టుకోవడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్ల వల్ల వెలువడే కాంతి, నిద్రకు సహాయపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. అలాగే ఫోన్‌ను తలకు దగ్గరగా ఉంచుకోవడం వల్ల రేడియేషన్ మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉందనే కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. అందుకే ఫోన్‌ను తలకు దూరంగా ఉంచడం లేదా వైర్‌లెస్ హెడ్‌సెట్ వాడటం మంచిది.

చాలామంది ఫోన్‌ను వెనుక జేబులో పెట్టుకుంటారు. దీనివల్ల కూర్చున్నప్పుడు ఫోన్ పగిలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల జీర్ణాశయం, కాళ్లలో అసౌకర్యం కలగవచ్చు. పురుషులు ఫోన్‌ను ముందు జేబులో ఎక్కువసేపు ఉంచడం వల్ల వీర్యకణాల నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే, ఫోన్ రేడియేషన్ ప్రభావంపై క్యాన్సర్ నిపుణులు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ఫోన్ రేడియేషన్ చాలా స్వల్పంగా ఉంటుందని, ఇప్పటివరకు ఉన్న అధ్యయనాల ప్రకారం దీని ప్రభావం చాలా తక్కువని లేదా అసలు లేదని వారు తెలిపారు. ఈ అంశాలపై స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్‌ను శరీరానికి అతుక్కుపోయేలా ఎక్కువసేపు ఉంచకపోవడం, ఛార్జింగ్ అలవాట్లలో జాగ్రత్తలు పాటించడం వంటి చర్యలు తీసుకోవడం ఉత్తమం.