నటి, గాయని అంజలి శివరామన్ ‘కోబాల్ట్ బ్లూ’ (2022) సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘క్లాస్’ (2023) లోని ‘సుహాని అహుజా’ పాత్రతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2025లో వెట్రిమారన్ నిర్మించిన ‘బ్యాడ్ గర్ల్’ సినిమాతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అంజలి, ప్రస్తుతం దర్శకురాలు మీరా నాయర్ రూపొందిస్తున్న ‘ఆమ్రి’ బయోపిక్‌లో నటిస్తున్నారు.
ప్రసిద్ధ చిత్రకారిణి అమృతా షేర్‌గిల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ అంజలికి చాలా ప్రత్యేకమైనది. ఈ పాత్ర కోసం సుమారు 100 మంది యువతులు ఆడిషన్లు ఇవ్వగా, చివరకు అంజలిని ఎంపిక చేశారు. మీరా నాయర్ వంటి అంతర్జాతీయ దర్శకురాలితో పనిచేయడం తన కల నెరవేరడమేనని, చాలా కాలంగా ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
అమృతా షేర్‌గిల్ 1913లో హంగేరిలో జన్మించిన గొప్ప మోడ్రన్ పెయింటర్. పంజాబీ తండ్రి, హంగేరియన్ తల్లికి జన్మించిన ఆమె, పారిస్‌లో విద్యనభ్యసించి వెస్ట్రన్, ఇండియన్ ట్రెడిషనల్ శైలులను కలిపి చిత్రాలు గీసేవారు. భారతీయ పల్లెటూరి ప్రజలు, పేద మహిళల జీవితాలను తన పెయింటింగ్స్‌లో ప్రతిబింబించిన ఆమెను ‘ఇండియన్ ఫ్రిదా కాహ్లో’ అని పిలుస్తారు.
కేవలం 28 ఏళ్ల వయసులో 1941లో అమృతా షేర్‌గిల్ మరణించారు. ఆమె గీసిన ‘త్రీ గర్ల్స్’, ‘బ్రహ్మచారీస్’ వంటి చిత్రాలు భారతీయ కళా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ చారిత్రక పాత్రలో అంజలి శివరామన్ నటన ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.








