గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట ప్రాంత వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ సరఫరాను ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. దీనిపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ స్పందిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది రైతుల ఖరీఫ్ పంటలు నష్టపోకుండా రక్షణ లభించిందని ఆయన పేర్కొన్నారు.
అయితే, ప్రతి సీజన్‌లోనూ సాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఒక శాశ్వత విధానాన్ని రూపొందించాలని వంశీ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరారు. మెట్ట ప్రాంత భూములు పోలవరం కుడి ప్రధాన కాలువ నీటి మట్టం కంటే ఎత్తులో ఉండటంతో, గురుత్వాకర్షణ పద్ధతిలో నీరు అందడం సాధ్యం కాదని ఆయన వివరించారు. దీంతో పంపుసెట్ల ద్వారా నీటిని ఎత్తిపోసుకోవడమే రైతులకు ఉన్న ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమస్యకు శాస్త్రీయ పరిష్కారం కోసం జలవనరులు, వ్యవసాయం, రెవెన్యూ, ఇంధన శాఖల అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని వంశీ సూచించారు. అర్హులైన ఆయకట్టును గుర్తించడం, పారదర్శక నిబంధనలను రూపొందించడం, దిగువ రైతుల హక్కులను కాపాడటం వంటి అంశాలను ఈ విధానంలో చేర్చాలని ఆయన కోరారు.
ఇలాంటి సంస్థాగత విధానం అమల్లోకి వస్తే రైతులకు భరోసా లభించడమే కాకుండా, నీటి నిర్వహణలో వివాదాలు తగ్గుతాయని వంశీ అభిప్రాయపడ్డారు. పోలవరం కాలువ ప్రయోజనాలు ప్రతి రైతుకూ సమానంగా, స్థిరంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.







