గత ఏడాది డిసెంబర్ 13న కోల్‌కతాలోని యువ భారతి స్టేడియంలో జరిగిన లియోనెల్ మెస్సీ ఈవెంట్ కోసం టికెట్లు కొనుగోలు చేసిన 33 వేల మంది అభిమానులకు డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నబన్నాలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ కార్యక్రమం కోసం అభిమానులు రూ. 4 వేల నుంచి రూ. 6 వేల వరకు వెచ్చించి టికెట్లు కొనుగోలు చేశారు. అయితే, స్టేడియంలో జరిగిన గందరగోళం మరియు నిర్వహణ లోపాల కారణంగా మెస్సీని ప్రత్యక్షంగా చూడలేకపోయిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ సమయంలో స్టేడియంలో కుర్చీలు విరగ్గొట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ గందరగోళానికి అప్పటి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ క్రీడా మంత్రి అరూప్ బిస్వాస్ అతిగా జోక్యం చేసుకోవడమే కారణమని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, క్రీడాభిమానులకు చెల్లించిన డబ్బును తిరిగి అందేలా చూడాలని తాను కోరుకుంటున్నానని సువేందు అధికారి పేర్కొన్నారు.
రాష్ట్ర క్రీడా బడ్జెట్ నుంచి ఈ నిధులను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన అంతర్గత ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి, ఈ బాధ్యతను విజయవంతంగా పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.







