మెదక్ జిల్లా చిన్నశంకరంపేట, చేగుంట, నార్సింగి మండల కేంద్రాల్లో యూరియా కోసం రైతులు మంగళవారం ఆందోళనలు చేశారు. చిన్నశంకరంపేటలోని ఆగ్రోస్ రైతు కేంద్రం వద్ద ఉదయం నుంచే రైతులు తమ చెప్పులను క్యూలో పెట్టి పడిగాపులు కాశారు.

మధ్యాహ్నం వరకు వేచి చూసినా యూరియా దొరక్కపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో యూరియా అందించలేమని ఆగ్రోస్ ఫర్టిలైజర్ నిర్వాహకులు చెప్పడంతో, అధికారులు ఎంపీపీ కార్యాలయం వద్ద పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అయితే అక్కడ కూడా రద్దీ పెరగడంతో అధికారులు పంపిణీని నిలిపివేశారు.

దీంతో ఆగ్రహించిన రైతులు చిన్నశంకరంపేటలోని మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఏవో (వ్యవసాయ విస్తరణాధికారి) ప్రవీణ్‌కుమార్‌పై రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న రైతుల పేర్లను నమోదు చేసి, బుధవారం యూరియా ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

మరోవైపు చేగుంటలో కూడా యూరియా కోసం రైతులు ఉదయం నుంచే క్యూలో నిల్చున్నారు. అయితే, దుకాణాలకు వచ్చిన యూరియా నిల్వల కంటే యాప్‌లో బుక్ చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో చాలామంది రైతులకు ఎరువులు అందలేదు.

నార్సింగిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఒక షాపునకు 500 యూరియా బస్తాలు రాగా, యాప్‌లో వెయ్యికి పైగా బుకింగ్‌లు నమోదయ్యాయి. దీంతో సగం మందికే యూరియా అందింది. తమకు ఎరువులు ఎందుకు అందలేదని, బుక్ చేసుకున్న బస్తాలు ఎక్కడికి వెళ్లాయని రైతులు ఆందోళన చెందారు.