ఎల్‌నినో ప్రభావం వల్ల మెదక్ జిల్లాలో వర్షాల కొరత ఏర్పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ రైతులకు సూచించారు. ఆదివారం కలెక్టరేట్ నుంచి విడుదల చేసిన ప్రకటనలో ఆమె ఈ మేరకు స్పష్టం చేశారు.
సాంప్రదాయ వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవడం వల్ల వర్షభావ పరిస్థితుల్లో కూడా రైతులకు నష్టం ఉండదని కలెక్టర్ పేర్కొన్నారు. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలు ఇచ్చే పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ, ప్రత్యామ్నాయ సాగు వైపు మొగ్గు చూపాలని ఆమె కోరారు.
జిల్లాలోని 12 రైతు వేదికల్లో ఈ నెల 27 నుంచి 29 వరకు విత్తన మేళాలు జరగనున్నాయి. అల్లాదుర్గా, రేగోడ్, శంకరంపేట(ఏ), టేక్మాల్, కౌడిపల్లి, చిలిపిచెడ్, కొల్చారం, వెల్దుర్తి, మాసాయిపేట, నర్సాపూర్, శివంపేట, మనోహరాబాద్, తూప్రాన్, మెదక్, హవేళిఘనపూర్, పాపన్నపేట, శంకరంపేట(ఆర్), చేగుంట, నార్సింగి, నిజాంపేట, రామాయంపేట మండల క్లస్టర్ల పరిధిలో ఈ మేళాలు అందుబాటులో ఉంటాయి.
ఈ విత్తన మేళాల్లో కంది, పెసర, మినుములు, మొక్కజొన్న మరియు కూరగాయల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతారు. రైతులు తమ సమీపంలోని రైతు వేదికలను సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న వ్యవసాయ శాఖ అధికారుల నుంచి తగిన సూచనలు, సలహాలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.








