అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల కమ్యూనిటీని బలోపేతం చేసే లక్ష్యంతో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) నార్త్ కరోలినా చాప్టర్ అధ్యక్షుడిగా విద్యాసాగర్ వంగాలను నియమించారు. ఐవోసీ గ్లోబల్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా మరియు జాతీయ అధ్యక్షుడు మొహిందర్ సింగ్ సంయుక్తంగా ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారు.

విద్యాసాగర్ వంగాల అమెరికాలో మెటా ఐటీ సిస్టమ్స్ అనే సంస్థను స్థాపించి, సీఈఓగా వ్యవహరిస్తున్నారు. పదేళ్లకు పైగా సాంకేతిక రంగంలో అనుభవం ఉన్న ఆయన, క్లౌడ్ కంప్యూటింగ్, AI, డెవ్ఆప్స్ మరియు డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ విభాగాల్లో నిపుణులు. ఫార్చ్యూన్ 500 సంస్థల ప్రాజెక్టులకు సాంకేతిక సలహాదారుగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

వృత్తిపరమైన బాధ్యతలతో పాటు, వంగాల ఫౌండేషన్ ద్వారా అమెరికా మరియు భారతదేశంలో ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్యం, సమానత్వం మరియు యువ నాయకత్వం వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రవాస భారతీయుల సమస్యలను పరిష్కరించడంలో ఆయన చురుగ్గా వ్యవహరిస్తుంటారు.

విద్యాసాగర్ నియామకంపై స్థానిక ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో నార్త్ కరోలినాలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని, భారతీయుల గొంతుకను మరింత బలంగా వినిపించే అవకాశం ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.