బషీరాబాద్‌: అగ్గనూర్‌ – బషీరాబాద్‌ రహదారి పనులకు మట్టి తరలిస్తున్న భారీ టిప్పర్ల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయని నావల్గా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామానికి చెందిన రైతు నాదీర్గ బాజరప్ప తన పొలం వద్ద టిప్పర్లకు అడ్డంగా రోడ్డుపై పడుకుని నిరసనకు దిగాడు. పొలాల మీదుగా భారీ వాహనాలు నడపడంతో పంటలకు నష్టం జరుగుతోందని, న్యాయం జరిగే వరకు కదిలేది లేదని స్పష్టం చేశాడు.

అదే గ్రామానికి చెందిన రైతు దాసరి బాలకష్ణ కూడా అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నాడు. గ్రామ సర్వే నంబర్‌ 257లో తనకు నాలుగు ఎకరాల లావాణి పట్టా భూమి ఉందని తెలిపారు. రహదారి పనుల పేరుతో తన భూమితోపాటు పక్కనే ఉన్న రైతుల భూముల్లోనూ అనుమతులు లేకుండా మట్టి తవ్వుతున్నారని ఆరోపించారు.

దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మట్టి తవ్వకాలను నిలిపివేయాలని, పంటలు, భూములకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.