సోమవారం సాయంత్రం అర్పనపల్లి గ్రామ శివార్లలోని గ్రానైట్ క్వారీ సమీపంలో చిరుతపులి కనిపించింది. తన వ్యవసాయ భూమి వద్ద పులిని చూసిన రైతు గండికోట కుమార్, భయంతో తన పెంపుడు కుక్కతో కలిసి సమీపంలోని బావిగుంతలో దాక్కున్నారు.
పులి వెళ్లిపోయిన తర్వాత, కుమార్ తన పొలంలో ఉన్న పాదముద్రలను ఫోన్‌లో ఫోటో తీశారు. ఆ ఫోటోలను గ్రామ వాట్సాప్ గ్రూపులో పెట్టడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గత రెండు రోజులుగా పులి తన పొలం వద్ద కనిపిస్తోందని కుమార్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో, మూడు రోజుల క్రితం గూడూరు మండలం బొల్లెపల్లి ప్రాంతంలో కూడా చిరుత కనిపించిందని అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. అయితే, అధికారులు ఆ ప్రాంతంలో గాలించినప్పటికీ పులి జాడ దొరకలేదు.
అర్పనపల్లిలో పులి పాదముద్రలు కనిపించాయని గ్రామస్తులు తమకు సమాచారం ఇచ్చారని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. అయితే, అవి చిరుతపులివి కాకుండా అడవిపిల్లి పాదముద్రలు కూడా అయి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. పులి సంచారంపై గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.








