రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫామ్‌హౌస్‌కు ముర్తుజాగూడలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి ప్రత్యేక విద్యుత్ లైన్ (ఫీడర్) వేయడానికి అధికారులు రూ. 1.17 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. టీ అండ్‌ డీ (విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థ మెరుగుదల) పనుల కింద ఈ ఎస్టిమేషన్ నంబర్ టీ-2628-65-01-13-04-001తో కార్పొరేట్ కార్యాలయానికి పంపారు.

ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో కథనం రావడంతో మంత్రి కోమటిరెడ్డి టీజీఎస్పీడీసీఎల్‌ (తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ) యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అసలు ఫామ్‌హౌసే లేదని, ఈ సమాచారం బయటకు ఎలా లీక్ అయిందని అధికారులను నిలదీశారు. వార్త తప్పు అని ప్రకటన ఇవ్వాలని ఆయన ఆదేశించడంతో, డిస్కమ్ అధికారులు హడావుడిగా ఖండన విడుదల చేశారు.

చిలుకూరు బాలాజీ ఆలయ పరిసరాల్లోని ప్రజలు, భక్తులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికే ఈ ప్రత్యేక ఫీడర్ ప్రతిపాదన అని డిస్కమ్ అధికారులు వాట్సాప్ గ్రూపుల్లో పేర్కొన్నారు. అయితే, ప్రజల కోసం చేసే పనులను మంత్రి పేరుతో ఎందుకు ప్రతిపాదించారని, 6.5 కిలోమీటర్ల దూరం నుంచి ఏబీ కేబుల్ ఎందుకు తెప్పిస్తున్నారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాలు మంత్రి పేరుతోనే ఉండటంపై చిలుకూరు ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) మాట మార్చారు. తనకు మంత్రి ఫామ్‌హౌస్ వ్యవహారం తెలియదని, ప్రజల ఇబ్బందుల కోసమే ప్రతిపాదన పంపానని ఆయన చెబుతున్నారు. కానీ, కార్పొరేట్ ఆఫీసుకు ఫైల్ పంపింది తానేనని తెలిసినా, మంత్రి ఒత్తిడి వల్లే ఆయన ఇలా స్పందిస్తున్నారని స్పష్టమవుతోంది.

మంత్రి కోమటిరెడ్డి ఇటీవల డిస్కమ్ ఉన్నతాధికారిని తన పని ఎందుకు ఆలస్యమవుతోందని అడిగినప్పుడు, అది సర్క్యులేషన్‌లో ఉందని త్వరలో పూర్తి చేస్తామని సమాధానం వచ్చింది. మీడియాలో కథనం రావడంతో ఇప్పుడు ఈ అంచనాల్లో సాంకేతిక మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.