నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారు. వరంగల్‌లోని రోహిణి ఆస్పత్రిలో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించాలని సూచించారు.
రోగి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా మల్కాజ్ గిరి ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఉప్పల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు పర్యవేక్షణలో, అంబులెన్స్ ప్రయాణించే మార్గంలో గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేసి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా అంబులెన్స్ వేగంగా ఆస్పత్రికి చేరుకునేలా చర్యలు తీసుకున్నారు.
ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రోహిణి ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆయన ఇంట్లో గుండెపోటుతో కిందపడిపోవడంతో ఆస్పత్రికి తరలించామని, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్‌కు పంపామని వివరించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన కోరారు.
అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లకు దారి ఇచ్చేలా వాహనదారులు మానవత్వంతో స్పందించాలని మల్కాజ్ గిరి ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల కోసం సెకన్లు కూడా కీలకమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని వారు కోరారు.







