కర్ణాటక, మైసూరు జిల్లా హున్సూర్ పట్టణంలోని న్యూ మారుతి లేఔట్‌లో మంగళవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. హరీష్ (39), అతని భార్య నిశ్చిత (37), పిల్లలు రక్ష (8), నక్ష (4) మృతి చెందారు. హరీష్ ఒక ఇన్సూరెన్స్ సంస్థలో వెహికల్ రికవరీ విభాగంలో పనిచేస్తున్నాడు.

ఘటన జరిగిన రోజున హరీష్ ముందుగా తన భార్య, ఇద్దరు పిల్లలను చంపేశాడు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని బెడ్‌పై వారి మృతదేహాలు లభించగా, వారి ఒంటిపై టేప్ చుట్టి ఉంది. అనంతరం హరీష్ ఇంటి పై అంతస్తుకు వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

ఘటనా స్థలంలో హరీష్ రాసిన సూసైడ్ లేఖను పోలీసులు గుర్తించారు. అందులో తన ఆస్తులు, అప్పుల వివరాలను పేర్కొంటూ, ఆ పత్రాలను ఒక వ్యక్తికి అందజేయాలని కోరాడు. ఆత్మహత్యకు మూడు రోజుల ముందే హరీష్ తన తల్లిని అమ్మమ్మ ఇంటికి పంపించినట్లు విచారణలో తేలింది.

మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులే ఈ ఘటనకు ప్రధాన కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.