మైసూరులోని హినాకల్ రిలయన్స్ మార్ట్‌లో టాటా బ్రాండ్స్ ప్రమోటర్‌గా పనిచేస్తున్న నాగేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. PPMS ఏజెన్సీ అనే మార్కెటింగ్ కంపెనీ ద్వారా ఆమె ఈ ఉద్యోగంలో చేరింది.
తాను పనిచేస్తున్న చోట ఎదుర్కొన్న పరిస్థితులపై నాగేశ్వరి ఒక లేఖ రాసింది. గత నాలుగు నెలలుగా తనకు ఒక్క వీక్లీ ఆఫ్ కూడా ఇవ్వలేదని, తనను టార్గెట్ చేసి అందరి ముందు అవమానించారని ఆమె ఆరోపించింది. డాలీ అనే సూపర్ వైజర్ తనను తీవ్రంగా వేధించాడని, ఆరోగ్యం బాగోలేక ఎమర్జెన్సీ లీవ్ అడిగినా నిరాకరించాడని లేఖలో పేర్కొంది.
వేధింపుల గురించి ప్రశ్నించినందుకు తనను ఉద్యోగం నుంచి తొలగించారని నాగేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. గత 15 రోజులుగా ఆమె తీవ్ర మానసిక క్షోభతో ఉన్నట్లు తల్లి రత్నమ్మ తెలిపారు. తన కూతురి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.







