మహిళల స్వేచ్ఛ, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. గురువారం 'ఆస్క్ మీ ఎనీథింగ్' కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్, శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో దీనిపై మరింత వివరణ ఇచ్చారు. కుటుంబాలు, సమాజంలో మహిళలు తమకు నచ్చిన విషయాలపై స్వేచ్ఛగా మాట్లాడాలని, పురుషాధిక్యత నుంచి వారికి విముక్తి అవసరమని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. రాహుల్ వైఖరిలో మార్పు కనిపిస్తోందని అభిప్రాయపడిన రిజిజు, దీనిని సానుకూల సంకేతంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.
2023లో పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంది. అయితే, దీని అమలుకు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అవసరం. ఈ బిల్లును తిరిగి ప్రవేశపెట్టే అంశంపై ప్రభుత్వం విపక్షాల మద్దతు కోరుతోంది.
ఈ విషయంపై కిరణ్ రిజిజు గురువారం రాహుల్ గాంధీతో ఫోన్‌లో మాట్లాడారు. బిల్లును త్వరగా తీసుకొస్తే రిజర్వేషన్ల అమలు వేగవంతం అవుతుందని, లేని పక్షంలో మహిళల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని ఆయన వివరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2026 రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రభుత్వం, విపక్షాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.








