పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI) కుట్రలో భాగంగా, పంజాబ్‌లోని లూథియానాలో ఒక 22 ఏళ్ల షూ దుకాణదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని రచ్పాల్ సింగ్‌గా గుర్తించారు. ఆగస్టు 27న అందిన సమాచారం ఆధారంగా లూథియానా కమిషనరేట్ పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం సంయుక్తంగా ఈ చర్య తీసుకున్నాయి.
నిందితుడు తన దుకాణం బయట చైనాలో తయారైన రెండు సీసీటీవీ కెమెరాలను అమర్చాడు. వీటి ద్వారా లూథియానా నగరం, సైనిక కార్యకలాపాల వివరాలను పాకిస్తాన్‌లోని తన హ్యాండ్లర్లకు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ సమాచారాన్ని ఉపయోగించి లూథియానాలో భారీ దాడి చేసేందుకు పాకిస్తానీ ఏజెన్సీలు కుట్ర పన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
విచారణలో భాగంగా రచ్పాల్ సింగ్ కీలక విషయాలు వెల్లడించాడు. పాకిస్థాన్‌లోని తన హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు, బధోవాల్ ఆయుధ డిపోకు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న లూథియానా-ఫిరోజ్‌పూర్ రోడ్డుపై అతను ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఈ దుకాణం కోసం నెలకు 40,000 రూపాయల అద్దె చెల్లిస్తున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏఐజీ సిమ్రత్ పాల్ సింగ్ ధిండ్సా తెలిపారు.
దుకాణం పెద్దగా నడవకపోయినా అద్దె చెల్లిస్తూ, సీసీటీవీ కెమెరాల దిశను నిందితుడు తరచుగా మారుస్తుండటంతో పోలీసులు అతడిని అనుమానించారు. ఈ గూఢచర్యానికి ప్రతిఫలంగా పాక్ హ్యాండ్లర్లు నిందితుడికి సుమారు 3 లక్షల రూపాయలు ముట్టజెప్పినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.








