LG స్మార్ట్ టీవీలు తమ పరిసరాల్లోని స్మార్ట్‌ఫోన్‌లు, ప్రింటర్లు, కంప్యూటర్ల వంటి ఇతర డివైజెస్‌ను గుర్తిస్తున్నాయని టెక్ రీసెర్చర్లు, సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ గుర్తించారు. టీవీ స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు లేదా స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నప్పుడు కూడా ఆడియో రికార్డు అవుతోందని, అలాగే వై-ఫై నెట్‌వర్క్ వివరాలను సేకరిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

ఈ డేటాను వ్యూయింగ్ డేటా, అంటే టీవీలో చూసే ప్రోగ్రామ్‌ల సమాచారం మరియు అడ్వర్టైజింగ్ ఐడీలతో జతచేసి యూజర్ల ప్రవర్తనను ట్రాక్ చేస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. ప్రోగ్రామ్‌లు, యాడ్స్‌ను గుర్తించే ఆటోమేటిక్ కంటెంట్ రికగ్నిషన్ (ACR) టెక్నాలజీ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతోందని వారు చెబుతున్నారు.

అయితే, ఈ ఆరోపణలను LG సంస్థ పూర్తిగా ఖండించింది. ACR అనేది పూర్తిగా యూజర్ ఆప్షన్ అని, అనుమతి లేకుండా ఎటువంటి డేటాను సేకరించమని సంస్థ స్పష్టం చేసింది. స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు ఆడియో రికార్డింగ్ జరగడం లేదని, ఇది అవాస్తవమని కంపెనీ పేర్కొంది.

రిమోట్‌లోని వాయిస్ బటన్ నొక్కినప్పుడు లేదా 'హాయ్ ఎల్‌జి' అనే వేక్ వర్డ్ ఉపయోగించినప్పుడు మాత్రమే వాయిస్ డేటా ప్రాసెస్ అవుతుందని LG వివరించింది. వేక్ వర్డ్ కోసం ఉపయోగించే ఆడియో డివైస్‌లోనే ఉంటుందని, అనధికారిక రికార్డింగ్స్ జరగవని కంపెనీ భరోసా ఇచ్చింది. నెట్‌వర్క్‌లోని ఇతర డివైజెస్‌ను స్కాన్ చేయడం అనేది కేవలం కనెక్టివిటీ కోసం మాత్రమేనని తెలిపింది.

యూజర్లు తమ భద్రత కోసం టీవీ సెట్టింగ్స్‌లో ACR, పర్సనలైజ్డ్ యాడ్స్, వాయిస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లను డిసేబుల్ చేసుకోవచ్చని LG సూచించింది. టీవీని గెస్ట్ వై-ఫై నెట్‌వర్క్‌లో ఉంచడం ద్వారా కూడా ప్రైవసీని మెరుగుపరచుకోవచ్చని కంపెనీ తెలిపింది.