చింతూరు, ఆగస్ట్‌ 22: పోలవరం జిల్లా చింతూరు మండలం బొడ్డుగూడెం సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి-30పై ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వారిలో ఒకరు సజీవ దహనమవ్వగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం..

ఛత్తీస్‌గఢ్‌ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న లారీని, భద్రాచలం నుంచి చింతూరు వైపు వస్తున్న టీఎస్‌08జీఈ 9755 నంబరు గల కారు వేగంగా ఢీకొట్టింది. ఢీకొన్న సమయంలో కారు డ్రైవర్‌కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని గమనించి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవింగ్‌ సీటులో ఉన్న వ్యక్తిని కారులో నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం పక్క సీటులో ఉన్న మరో వ్యక్తిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా కారు డోర్‌ లాక్‌ అయింది. ఇంతలోనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పక్క సీటులో ఉన్న వ్యక్తిని బయటకు తీసేలోపే మంటలు చుట్టుముట్టాయి. వాహనదారులు చూస్తుండగానే అతడు కారులో సజీవ దహనమయ్యాడు.

మరోవైపు తీవ్రంగా గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో సమీపంలోని ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ మృతి చెందడంతో వారి వివరాలు, స్వస్థలం తదితర సమాచారం ఇంకా తెలియరాలేదు. కారు నంబరు, ఇతర ఆధారాల ఆధారంగా మృతుల వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి అతివేగమే కారణమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.