63 కిలోమీటర్ల పొడవైన లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైన 18 రోజులకే 84 చోట్ల కుంగిపోయింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ రహదారులను అమెరికాతో పోల్చిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాన్పూర్ వైపు మార్గంలో 39 చోట్ల, లక్నో వైపు మార్గంలో 45 చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేపట్టాల్సి వచ్చింది.
ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు లక్నో సీనియర్ ఇంజినీర్ శైలేంద్ర సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. మట్టిని పరిచేటప్పుడు, పునాది నిర్మించేటప్పుడు నాణ్యత పాటించలేదని ఆయన పేర్కొన్నారు. జూలై 30న కంకర లోడుతో వెళ్తున్న ట్రక్కు కుంగిపోయి బోల్తా పడటంతో ఈ లోపాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం దెబ్బతిన్న ప్రాంతాల్లో తేమను తొలగించేందుకు శక్తివంతమైన ఫ్యాన్లను ఏర్పాటు చేసి మరమ్మతులు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టును పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ నిర్మించింది. ఈ సంస్థపై గతంలోనే అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిషేధం విధించినా, ఏడాది తర్వాత దానిని ఎత్తివేసింది. ప్రస్తుతం ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఈ సంస్థను పనితీరు సరిగా లేనిదిగా ప్రకటించి, ముగ్గురు అధికారులను తొలగించింది. రానున్న రెండేళ్లపాటు ఆ సంస్థ కొత్త పనుల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.
ప్రస్తుతం ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన నిపుణుల బృందం రోడ్డు కుంగిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తోంది. మరమ్మతు పనులు కొనసాగుతుండటంతో ట్రాఫిక్‌ను సింగిల్ క్యారేజ్‌వే ద్వారా మళ్లిస్తున్నారు. కిలోమీటరుకు రూ. 75 కోట్ల చొప్పున మొత్తం రూ. 4,700 కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టు నాణ్యతపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.








