నేరాల అదుపు, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బి. తాండ్రపాడు సమీపంలో ఉన్న కాదంబరి టౌన్‌షిప్‌లో ఏర్పాటు చేసిన 35 సీసీ కెమెరాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు.

ఆధునిక సాంకేతికతను వాడుకోవడం ద్వారా నేరాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎస్పీ తెలిపారు. దర్యాప్తు వేగవంతం కావడమే కాకుండా, నేరస్తులను గుర్తించి చట్టం ముందు నిలబెట్టేందుకు సీసీ కెమెరా దృశ్యాలు ప్రధాన ఆధారాలుగా మారుతున్నాయని ఆయన వివరించారు. రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు సంబంధించిన కేసుల్లో ఈ వీడియోలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరస్థుల్లో భయం పెరిగి, నేరాలు చేసే అవకాశం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాలోని ప్రతి అపార్ట్‌మెంట్, కాలనీ, వ్యాపార సంస్థలు, రద్దీ ప్రాంతాలు మరియు గ్రామాల ప్రవేశ మార్గాల్లో నాణ్యమైన కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

ప్రజల సహకారంతోనే నిఘా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ రాఘవేంద్ర, సీఐలు కేశవరెడ్డి, తేజమూర్తి, కాలనీ ప్రతినిధులు మధుమోహన్, కరుణాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.