కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్ సమీపంలో ఒక అరుదైన ఇండియన్ పాంగోలిన్ కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు, సింగరేణి కాలరీస్ కంపెనీ (SCCL) సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఆ జీవిని రక్షించారు.

ప్రమాదంలో ఉన్న జాతుల జాబితాలో ఉన్న ఈ పాంగోలిన్, అడవిలో పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రధానంగా చీమలు, చెదపురుగులను తింటూ జీవిస్తుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంతో జిల్లా అటవీ అధికారి సిబ్బందిని అభినందించారు.

ఇలాంటి అడవి జంతువులు జనావాసాల్లో కనిపిస్తే ప్రజలు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించవద్దని అధికారులు కోరుతున్నారు. జంతువులను చూసిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. రక్షించిన పాంగోలిన్‌ను కిన్నెరసాని డీర్ పార్కు అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.