ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను వ్యతిరేకించే వారికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అర్హత లేదని ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు ఆయన తీవ్రంగా స్పందించారు.

మంత్రి కొండా సురేఖ తన కుమార్తె కొండా సుష్మిత మాటలకు తనకు సంబంధం లేదని చెప్పడం సరికాదని వీరేశం అన్నారు. తల్లికి సంబంధం లేనప్పుడు, ఆమె చేసిన వ్యాఖ్యలను సురేఖ ఎందుకు ఖండించలేదని ఆయన ప్రశ్నించారు.

కొండా సురేఖ ఉపయోగిస్తున్న తప్పుడు భాష వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వీరేశం ఆరోపించారు. మంత్రి పదవిలో ఉంటూనే పార్టీని ఇబ్బంది పెట్టడం తగదని ఆయన హెచ్చరించారు.

నటి సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీకి తలనొప్పిగా మారాయని వీరేశం పేర్కొన్నారు. సురేఖ భాష ఎప్పుడూ పార్టీకి నష్టం కలిగించే విధంగానే ఉంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని కొండా సుష్మిత, పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అడ్డగోలుగా మాట్లాడడం సరికాదని వీరేశం అన్నారు. రాజకీయ విలువలను కాపాడాలని ఆయన కొండా సురేఖను కోరారు.