హైదరాబాద్‌లోని కోకాపేట్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదన్ మోహన్ రెడ్డి అనే ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఇన్నోవా క్రిస్టా కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మైనర్లు అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
వీరంతా హైటెక్ సిటీలోని తేజు కాలేజీలో చదువుతున్న విద్యార్థులు. తమన్ వర్మ అనే స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి హాజరైన వీరు, అనంతరం ఔటర్ రింగ్ రోడ్డుపై లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు. నియో పోలీస్ వద్దకు చేరుకోగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో మదన్ మోహన్ రెడ్డి అక్కడికక్కడే మరణించగా, మిగిలిన ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిన కారులో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








