సాధారణంగా హిందూ దేవాలయాల్లో పండ్లు, స్వీట్లు, పాయసం వంటి పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెడతారు. అయితే, కేరళలోని తెక్కన్ పళని బాలసుబ్రహ్మణ్య ఆలయంలో మాత్రం భక్తులు మంచ్ చాక్లెట్లను స్వామివారికి సమర్పిస్తున్నారు. పూజ అనంతరం ఆ చాక్లెట్లనే భక్తులకు ప్రసాదంగా పంచుతున్నారు.

ఈ సంప్రదాయం వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది. గతంలో అనారోగ్యంతో బాధపడిన ఒక చిన్నారికి, ఆ కుటుంబం బాల మురుగన్‌కు మంచ్ చాక్లెట్ నైవేద్యంగా పెట్టింది. ఆ తర్వాత చిన్నారి ఆరోగ్యం మెరుగుపడటంతో, ఈ ఆచారం భక్తుల్లో నమ్మకంగా మారింది.

దీంతో భక్తులు తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ స్వామివారికి చాక్లెట్లను సమర్పించడం మొదలుపెట్టారు. ఈ ప్రత్యేక నైవేద్యం కారణంగా భక్తులు బాల మురుగన్‌ను ముద్దుగా ‘ముంచ్ మురుగన్’ అని పిలుచుకుంటున్నారు.

ఆలయంలో ముంచ్ చాక్లెట్లను పెద్ద పాత్రలో నింపి స్వామివారికి సమర్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. దీనిని భక్తులు ‘ముంచ్ పారా’ అని పిలుస్తారు. ఈ వింత ఆచారానికి సంబంధించిన వీడియోను ఒక మహిళా భక్తురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.