ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు 1న విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో 69 మంది మంత్రులు ఉండగా, మరో 12 మందిని నియమించుకునే అవకాశం ఉంది. 70 ఏళ్లు దాటిన మంత్రులను తొలగించి, యువ ఎంపీలకు అవకాశం కల్పించాలని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు క్యాబినెట్ ర్యాంకు మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ సహాయ మంత్రులుగా ఉన్నారు. విస్తరణ తర్వాత కూడా వీరిని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, పెమ్మసాని చంద్రశేఖర్‌కు స్వతంత్ర బాధ్యతలతో కూడిన పదోన్నతి దక్కవచ్చని, ముగ్గురు మంత్రుల శాఖలు మారవచ్చని ప్రచారం జరుగుతోంది.
కేంద్ర మంత్రివర్గంలో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జనసేన పార్టీకి ఈసారి అవకాశం దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ పేర్లు ఈ రేసులో ఉన్నాయి. వీరిలో సీనియర్ నాయకుడైన బాలశౌరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
మరోవైపు, పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీలు, కొత్త నియామకాలపై కూడా కసరత్తు జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆయనను తమిళనాడు గవర్నర్‌గా పంపే అవకాశం ఉందని తెలుస్తోంది.
టీడీపీ కోటాలో కూడా ఒకరికి గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉంది. యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, ప్రతిభా భారతి పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. యనమల రామకృష్ణుడికి గవర్నర్ పదవి ఇస్తే, అది బీసీ సామాజికవర్గానికి పెద్దపీట వేసినట్లు అవుతుందని టీడీపీ భావిస్తోంది.
కేంద్ర మంత్రివర్గ విస్తరణతో పాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియామకాలు కూడా జరగనున్నాయి. ఏపీ నుంచి కొత్తగా కేంద్ర మంత్రి పదవి ఎవరికి దక్కుతుంది, గవర్నర్ పదవులకు ఎవరి పేర్లు ఖరారు అవుతాయనేది త్వరలోనే స్పష్టం కానుంది.








