మండ్య జిల్లా శ్రీరంగపట్నం తాలూకాలోని అరతి ఉక్కాడ ఆలయంలో బుధవారం ఈ వివాదం చోటు చేసుకుంది. వీఐపీ దర్శన మార్గంలో వెళ్తున్న సమయంలో తముకూరు రూరల్ ఎమ్మెల్యే సురేశ్ గౌడ కుమార్తె ఐశ్వర్యకు, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ బి. సబితకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే సీఐ లక్ష్మీ చూస్తుండగానే ఐశ్వర్య, ఎస్ఐ సబిత చెంపపై కొట్టారు.

దీంతో ఎస్ఐ సబిత క్యాతనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఐశ్వర్యపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు, నేరాలకు సంబంధించిన కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఐశ్వర్య కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐపై ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే సురేశ్ గౌడ స్పందిస్తూ, తన కుమార్తెను ఎస్ఐ దూషించారని ఆరోపించారు. ఆలయ గర్భగుడిలోకి వెళ్లేందుకు అనుమతి కోరినప్పుడు పోలీసులు నిరాకరించడంతో ఘర్షణ జరిగిందని ఆయన తెలిపారు. తన కుమార్తె ఎస్ఐను కొట్టిన వీడియోను తాను చూడలేదని, ఒకవేళ అది నిజమైతే ఎస్ఐకు క్షమాపణలు చెబుతానని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఐశ్వర్య భర్త కేసీ గౌతమ్ పోలీస్ శాఖలో డీవైఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా పనిచేస్తుండటం గమనార్హం.