కరకగూడెం పీహెచ్‌సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) వైద్యాధికారి రవితేజ ఆధ్వర్యంలో శుక్రవారం భుట్టుపల్లి పంచాయతీలోని కేజీబీవీ పాఠశాల, వసతి గృహంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
జాతీయ కీటకజన్య వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా పాఠశాల గదులు, వసతి గృహాల్లో దోమల మందును సిబ్బంది పిచికారి చేయించారు. మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఈ ముందుస్తు చర్యలు చేపట్టినట్లు వైద్యాధికారి రవితేజ తెలిపారు.
పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. అనారోగ్య సమస్యలు ఏవైనా తలెత్తినప్పుడు వెంటనే స్థానిక పీహెచ్‌సీని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ హెచ్ఈఓ కృష్ణయ్యతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.








