చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కాణిపాకం వినాయక స్వామి సాక్షిగా ప్రమాణాలు చేయాలనే సవాల్ ఇప్పుడు అధికార టీడీపీకి తలనొప్పిగా మారింది. పోలీసు స్టేషన్లు, కోర్టులకు వెళ్లాల్సిన వివాదాలను దేవుడి ముందు పెట్టడం ద్వారా వైసీపీ రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహం అమలు చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మొదలైన వివాదం కాణిపాకం వరకు చేరింది. బెంగళూరు నగరాన్ని చిత్తూరు వారు ఏలుతున్నారన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు నిరసన తెలపగా, దీని వెనుక వైసీపీ ఉందని ఎమ్మెల్యే ఆరోపించారు. దీనికి కౌంటర్‌గా వైసీపీ ఇన్‌చార్జ్ విజయానంద రెడ్డి, తాను కాణిపాకం కోనేటిలో మునిగి ప్రమాణం చేసి, టీడీపీ నేతలకు కూడా అదే సవాల్ విసిరారు. దీంతో టీడీపీ నేతలు స్పందించలేక మౌనం వహించారు.

తిరుపతిలో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. పసుపులేటి మురళి హత్య కేసు వివాదంలో, టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ నివాసంపై దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు నలుగురు వైసీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేత వాసు యాదవ్ తన అరెస్టుకు ముందే కాణిపాకంలో ప్రమాణం చేసి, జేబీ శ్రీనివాస్‌కు సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు టీడీపీ నుంచి స్పందన రాకపోవడంతో, అనవసరంగా ఈ వివాదాలను కదిపి వైసీపీకి హీరో ఇమేజ్ ఇచ్చామనే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.