స్థానిక సంస్థల ఎన్నికల నగారా ఇంకా పూర్తి స్థాయిలో మోగకముందే, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన నేతల మధ్య ఖర్చుల విషయంలో కొత్త చర్చ మొదలైంది. సీట్ల కేటాయింపు కంటే ముందే ప్రచార ఖర్చులను ఎవరు భరించాలనే విషయంలో టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు పట్టుబడుతున్నారు.
జనసేన అభ్యర్థులు ఆర్థికంగా బలహీనంగా ఉన్న చోట, ఆ ఖర్చును కూడా తామే భరించాలా అని టీడీపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టామని, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా పక్క పార్టీ అభ్యర్థుల కోసం ఖర్చు చేయడం భారమని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
మరోవైపు, కూటమి విజయం కోసం ఇద్దరం కలిసి పనిచేస్తున్నప్పుడు, ఖర్చులను కూడా పంచుకోవాలని జనసేన నేతలు వాదిస్తున్నారు. ఆర్థిక స్తోమత తక్కువగా ఉన్న అభ్యర్థులకు మిత్ర ధర్మం ప్రకారం సగం ఖర్చును టీడీపీ భరించాలని వారు కోరుతున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లె, మదనపల్లె, చంద్రగిరి, చిత్తూరు, పలమనేరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేయాలని రాష్ట్ర నాయకత్వం పిలుపునిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఖర్చుల విషయంలో సమన్వయం కుదరడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీకి పట్టున్న చోట జనసేన సీటు కోరితే, ఆ అభ్యర్థికి టీడీపీ నేతలు మనస్ఫూర్తిగా సహకరిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఎన్నికల ప్రచార రథాలు, వాహనాలు, కార్యకర్తల బాగోగులు, పోలింగ్ ఏర్పాట్లు వంటి ప్రతి అంశం డబ్బుతో ముడిపడి ఉండటంతో, ఈ వివాదం కూటమి ఐక్యతకు పరీక్షగా మారుతోంది. సీట్ల పంపకం ఖరారు కాకముందే మొదలైన ఈ ఖర్చుల లొల్లి, రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందోనని రెండు పార్టీల కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.








