గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో దక్షిణాఫ్రికా స్టార్ స్విమ్మర్ చాడ్ లే క్లోస్ చరిత్ర సృష్టించాడు. పురుషుల 4×100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో కాంస్య పతకాన్ని గెలుచుకోవడంతో, తన కెరీర్‌లో మొత్తం 19 కామన్వెల్త్ పతకాలను క్లోస్ పూర్తి చేసుకున్నాడు. ఈ విజయంతో కామన్వెల్త్ క్రీడల చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన పురుష అథ్లెట్‌గా అతడు అగ్రస్థానానికి చేరుకున్నాడు.
గతంలో ఆస్ట్రేలియాకు చెందిన ఫిల్ అడమ్స్, ఇంగ్లండ్‌కు చెందిన మిక్ గాల్ట్ 18 పతకాలతో సంయుక్తంగా రికార్డును కలిగి ఉండేవారు. ఇప్పుడు వారి రికార్డును క్లోస్ అధిగమించాడు. 34 ఏళ్ల క్లోస్ తన కామన్వెల్త్ ప్రస్థానంలో ఇప్పటివరకు 7 స్వర్ణాలు, 4 రజతాలు, 8 కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు.
2010 న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌తో అంతర్జాతీయ వేదికపై అరంగేట్రం చేసిన క్లోస్, అప్పుడే ఐదు పతకాలను సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. రికార్డును నెలకొల్పిన వేళ అతడు భావోద్వేగానికి లోనయ్యాడు. ఇప్పటికే ఒలింపిక్స్‌లో నాలుగు పతకాలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో 16 టైటిళ్లను క్లోస్ సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుత గ్లాస్గో ఎడిషన్‌లో క్లోస్ పోటీలు ఇంకా ముగియలేదు. రాబోయే రోజుల్లో 50 మీటర్లు, 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్లలో అతడు పాల్గొనాల్సి ఉంది. అలాగే, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో కూడా పోటీ పడాలని క్లోస్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.







