స్కాట్లాండ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జ్ఞానేశ్వరి యాదవ్ అద్భుత ప్రదర్శన చేశారు. వెయిట్‌లిఫ్టింగ్ 53 కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఆమె, స్నాచ్‌లో 88 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 111 కిలోలు కలిపి మొత్తం 199 కిలోల బరువును ఎత్తి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. సీనియర్ కామన్వెల్త్ క్రీడల్లో ఆమెకు ఇదే తొలి పతకం.
ఈ విజయం వెనుక జ్ఞానేశ్వరి తండ్రి దీపక్ యాదవ్ పడిన కష్టం ఎంతో ఉంది. బాడీబిల్డర్‌గా తన క్రీడా కలను వదులుకున్న దీపక్, ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ తన కూతురిని అథ్లెట్‌గా తీర్చిదిద్దారు. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, అప్పులు చేసి మరీ ఆమెకు అవసరమైన పోషకాహారం, సప్లిమెంట్స్ అందించారు. ప్రస్తుతం జ్ఞానేశ్వరి ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖలో అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఏడో తరగతిలో ఉన్నప్పుడు స్థానిక జాతరలో వెయిట్‌లిఫ్టింగ్‌ను చూసి ఆకర్షితురాలైన జ్ఞానేశ్వరి, పవర్‌లిఫ్టింగ్‌తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కోచ్ అజయ్ లోహార్ విశ్వకర్మ వద్ద శిక్షణ తీసుకున్న ఆమె, సబ్-జూనియర్ జాతీయ స్థాయిలో స్వర్ణం సాధించి వెయిట్‌లిఫ్టింగ్‌లోకి మారారు. 2022 జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం, 2023 కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, 2025 జాతీయ క్రీడల్లో పసిడి పతకం సాధించిన ఆమె, తాజాగా 2026 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కూడా రజతంతో మెరిశారు.






