గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత మహిళా బాక్సర్లు పసిడి పతకాలతో మెరిశారు. ఆగస్ట్ 1న జరిగిన ఫైనల్ పోరుల్లో ప్రియా ఘాంఘాస్, సాక్షి చౌదరి, అరుంధతి చౌదరి విజేతలుగా నిలిచారు. వీరితో పాటు ప్రీతి పవార్, జాస్మిన్ కూడా స్వర్ణాలు సాధించడంతో, బాక్సింగ్‌లో భారత్‌కు ఆ ఒక్కరోజే ఐదు స్వర్ణ పతకాలు దక్కాయి.

51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి ఇంగ్లాండ్‌కు చెందిన రూబీ వైట్‌ను 5-0 తేడాతో ఓడించి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. 60 కేజీల లైట్‌వెయిట్ విభాగంలో ప్రియా ఘాంఘాస్ కెనడా బాక్సర్ మేరీ-బాథౌల్ అల్-అహ్మదియాపై 4-1 తేడాతో గెలుపొందింది. అలాగే 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి ఇంగ్లాండ్ ప్లేయర్ చాంటెల్ రీడ్‌ను ఓడించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

ఈ విజయాలతో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ సాధించిన మొత్తం స్వర్ణ పతకాల సంఖ్య 11కి చేరింది. బ్యాక్ టు బ్యాక్ పతకాలతో భారత మహిళా బాక్సర్లు చరిత్ర సృష్టించారు. బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థులపై పంచుల వర్షం కురిపిస్తూ భారత క్రీడాకారిణులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.