పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సాయం అందించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైకోర్టును సాకుగా చూపుతూ, ఈ పథకాల ద్వారా లక్షలాది నిరుపేద కుటుంబాలకు అందుతున్న ఆర్థిక భరోసాను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎత్తివేస్తోందని ఆయన ఆరోపించారు.
2014 అక్టోబర్ 2న కేసీఆర్ హయాంలో ప్రారంభమైన ఈ పథకాల ద్వారా ఇప్పటివరకు సుమారు 13 లక్షల కుటుంబాలకు రూ. 13 వేల కోట్ల సాయం అందిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తుండటంతో, ఆ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం ఈ పథకాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.
ఈ పథకాలకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు, ప్రభుత్వం నాలుగుసార్లు గడువు ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర అంశాల్లో ప్రైవేట్ న్యాయవాదులను నియమించుకునే ప్రభుత్వం, పేద ఆడబిడ్డల ప్రయోజనాల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో, ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. పెండింగ్‌లో ఉన్న అర్హత కలిగిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, ఆర్థిక సాయాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.







