కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటలు పండాయని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారం అబద్ధమని హరీశ్‌రావు విమర్శించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆయన, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు వంటి ప్రాజెక్టులు కాళేశ్వరం వ్యవస్థలో భాగమేనని గుర్తు చేశారు.
ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తిపోసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ఇవన్నీ పంట సాగుకు కారణమని ఆయన పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణ, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం వల్లే రికార్డు పంటలు సాధ్యమయ్యాయని హరీశ్‌రావు వివరించారు.
రాష్ట్ర నీటి హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) ఎజెండా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 18న జరగనున్న GRMB సమావేశంలో ఆ అంశాలను తొలగించకపోతే బీఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని హరీశ్‌రావు హెచ్చరించారు. ఆ సమావేశానికి వెళ్లే ముందు ప్రభుత్వం స్పందించకపోతే, బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన స్పష్టం చేశారు.







