కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు అత్యంత నాణ్యతతో ఉన్నాయని పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ (సెంటర్‌ ఫర్‌ వాటర్‌, పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌) తన నివేదికలో పేర్కొంది. ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల భద్రతను పరిశీలించేందుకు ఎన్‌డీఎస్‌ఏ (నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ) సూచన మేరకు ఈ సాంకేతిక పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో భాగంగా డ్రోన్‌ సర్వేలు, భూగర్భంలోని మట్టి పొరలను పరీక్షించే జీపీఆర్‌ (గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌) స్కానింగ్‌, జియోటెక్నికల్‌, జియోఫిజికల్‌ అధ్యయనాలు చేపట్టారు. వీటి ద్వారా బరాజ్‌ల కాంక్రీట్‌ నిర్మాణం, గేట్ల నాణ్యత, కాంక్రీట్‌ సాంద్రతను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లోని అన్ని పియర్స్‌ (స్తంభాలు) 100 శాతం నాణ్యతతో ఉన్నాయని, ఎటువంటి లోపాలు లేవని నివేదిక స్పష్టం చేసింది.

మేడిగడ్డ బరాజ్‌ విషయానికి వస్తే, 7వ బ్లాక్‌ మినహా మిగిలిన అన్ని బ్లాకులు సురక్షితంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్‌ కింద సుమారు 1,000 క్యూబిక్‌ మీటర్ల శూన్యం ఏర్పడటం వల్లే కుంగుబాటు జరిగిందని గుర్తించారు. ఈ ఖాళీని సిమెంట్‌, ఇసుక మిశ్రమంతో నింపే గ్రౌటింగ్‌ ప్రక్రియ ద్వారా నీటి లీకేజీని అరికట్టవచ్చని, బరాజ్‌ను తాత్కాలికంగా వినియోగించుకోవచ్చని అధికార వర్గాలు గతంలోనే వెల్లడించాయి.

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పడావు పెట్టిందని, ప్రాజెక్టు కూలిపోతుందంటూ చేస్తున్న ప్రచారం అవాస్తవమని బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తున్నారు. మేడిగడ్డ ఘటనను సాకుగా చూపి ప్రాజెక్టును నిలిపివేయడం వల్ల రాష్ట్రంలోని సగానికి పైగా జిల్లాలకు సాగు, తాగునీరు అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నివేదికతో ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, కుట్రలు పటాపంచలయ్యాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు.

బరాజ్‌లు సురక్షితమని తేలిన నేపథ్యంలో, వాటిని తక్షణమే వినియోగంలోకి తెచ్చి గోదావరి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్‌ పెరుగుతోంది. కన్నెపల్లి పంపులను ఆన్‌ చేయడం ద్వారా ప్రాణహిత జలాలను ఒడిసిపట్టి, ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదుగా వివిధ రిజర్వాయర్లకు నీటిని తరలించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలనే డిమాండ్‌పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.