కాకినాడకు చెందిన సతీష్ రెడ్డి, సాయికిరణ్ ఎనిమిదేళ్లుగా స్నేహితులు. జిమ్ ట్రైనర్‌గా పనిచేసే సతీష్‌కు ఇటీవలే వివాహం జరిగింది. సాయికిరణ్ తన ప్రియురాలితో గొడవ పడటంతో, సతీష్ తన గురించి ఆమెకు తప్పుడు విషయాలు చెబుతున్నాడని అనుమానించాడు.

ఈ విషయంలో గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి మాట్లాడాలని సతీష్‌కు సాయికిరణ్ ఫోన్ చేయడంతో, సతీష్ అతడిని కలిసేందుకు వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయికిరణ్, తన స్నేహితులతో కలిసి సతీష్‌పై దాడి చేశాడు.

జిమ్ ట్రైనర్ కావడంతో సతీష్ కొంతసేపు వారిని అడ్డుకున్నాడు. అయితే నలుగురు వ్యక్తులు కలిసి సతీష్‌ను తీవ్రంగా కొట్టి, పక్కనే ఉన్న చెక్కతో గొంతులో పొడిచారు. దీంతో సతీష్ అక్కడికక్కడే మరణించగా, నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సతీష్‌ను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సతీష్ భార్య గర్భవతి కావడంతో, ఈ మరణం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్నేహితుడిని కోల్పోయిన బాధలో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.