ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ జనాబ్ మహమ్మద్ ఫరూఖ్ షిబ్లీ విజయవాడలోని తన కార్యాలయంలో ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. కడపలోని హరిప్రియ ఫంక్షన్ హాల్‌లో ఆగస్టు 2న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 'ఉర్దూ కి ఉడాన్ – ఉర్దూ సాహిత్య వికాసం' పేరుతో ఈ సభను నిర్వహిస్తున్నారు.

ఉర్దూ భాషను కేవలం ఒక మతానికి పరిమితం చేయకుండా, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ముస్లిమేతర ఉర్దూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పరిశోధకులు మరియు పండితులను ఒకే వేదికపై గౌరవించనున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా ఉర్దూ భాషపై ఉన్న అపోహలను తొలగించి, అన్ని వర్గాల ప్రజలను సాహిత్యంతో అనుసంధానం చేయాలని అకాడమీ భావిస్తోంది. ముఖ్యంగా యువతకు ఉర్దూ ద్వారా విద్య, ఉపాధి, పరిశోధన, అనువాదం మరియు డిజిటల్ మీడియా రంగాల్లో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించనున్నారు.

ఉర్దూ ఒక భాష మాత్రమేనని, దాని అభివృద్ధి అందరి బాధ్యత అని ఫరూఖ్ షిబ్లీ పేర్కొన్నారు. ఆధునిక అవకాశాలతో ఉర్దూను అనుసంధానించి యువత భవిష్యత్తుకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భాషాభిమానులు, విద్యార్థులు, సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.