మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. గురువారం నాటికి ప్రాజెక్టులోకి 1,04,375 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అధికారులు 17 గేట్ల ద్వారా 67,235 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 317.51 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉంది. మొత్తం 9.657 టీఎంసీల సామర్థ్యానికి గాను, ప్రస్తుతం 7.663 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడ్, కోయిల్‌సాగర్, భీమా లిఫ్ట్-1, భీమా లిఫ్ట్-2 ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోస్తున్నారు. దీనివల్ల గుడ్డెందొడ్డి, ర్యాలంపాడ్ రిజర్వాయర్లలోకి నీరు చేరుతుండటంతో రైతులు వానకాలం సాగుపై ఆశలు పెంచుకున్నారు. విద్యుదుత్పత్తి కోసం 37,906 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా, డమ కాల్వకు 870, కుడి కాల్వకు 500, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పెరుగుతుండటంతో సాగుకు ఇబ్బందులు ఉండవని రైతులు భావిస్తున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగితే అదనంగా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని డ్యాం అధికారులు తెలిపారు.







