విజయవాడ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ కుటుంబ వివాదం మరో మలుపు తిరిగింది. జోగి రమేష్ సోమవారం తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మీడియా ముందుకు వచ్చిన మరుసటి రోజే ఆయన కోడలు మేఘన విలేకరుల సమావేశం నిర్వహించి తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసేందుకే మీడియా ముందుకు వచ్చానని ఆమె తెలిపారు. 2025 మేలో జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌తో తన వివాహం జరిగిందని మేఘన తెలిపారు. తండ్రి తన సంతోషం కోసం ఎంతో కష్టపడి పెళ్లి చేశారని, జోగి రమేష్‌పై నమ్మకంతో తమ కుటుంబం తనను వారి ఇంటి కోడలిగా పంపిందని చెప్పారు. అయితే పెళ్లయిన కొద్దిరోజులకే తనను ఇబ్బందులకు గురిచేయడం ప్రారంభించారని ఆరోపించారు.
రాజీవ్‌కు ఉన్న సమస్యలు కుటుంబ సభ్యులకు ముందే తెలుసని, అయినప్పటికీ తనతో వివాహం చేయడం అన్యాయమని అన్నారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానే విడిపోయామని జోగి రమేష్ చెబుతున్నారని, అసలు తమ మధ్య ఎలాంటి గొడవ జరిగిందో ఆయన చెప్పాలని మేఘన డిమాండ్ చేశారు. వాస్తవాలను పక్కదారి పట్టించేందుకే జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చారని ఆరోపించారు.
వివాహం అనంతరం ఎదురైన ఇబ్బందులను తన మామ, అత్తకు వివరించానని మేఘన తెలిపారు. సమస్యలను పరిష్కరించకుండా అదనపు కట్నం తీసుకురావాలని తనను వేధించారని జోగి రమేష్ కోడలు మేఘన ఆరోపించారు. రాజకీయ పలుకుబడి ఉందని, తాము చెప్పినట్లే వినాలని బెదిరించారని చెప్పారు. అదనపు కట్నం తీసుకొస్తేనే భర్త తనను సంతోషంగా చూస్తాడని అత్త చెప్పేవారని ఆరోపించారు.
తన పెళ్లికి ముందు హిందువులమని చెప్పి వివాహం చేశారని, అయితే అత్తింటి కుటుంబం క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న విషయం తనకు ముందుగా చెప్పలేదని మేఘన ఆరోపించారు. చిన్ననాటి నుంచి హిందూ సంప్రదాయాల ప్రకారం పూజలు చేసుకోవడం తనకు అలవాటని, అత్తింట్లో పూజ చేసుకునే సమయంలో తనను అడ్డుకున్నారని చెప్పారు.
దేవుళ్ల ఫొటోలు పెట్టుకుని పూజ చేస్తుండగా అడ్డుకుని, హారతి, అగరుబత్తీలు లాక్కుని పడేశారని, తనపై దాడి చేశారని ఆరోపించారు. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవేనని, అయితే వాటి గురించి ముందే వాస్తవాలు చెప్పకుండా వివాహం చేయడం మోసం కాదా అని ప్రశ్నించారు.
తనపై జోగి రమేష్ కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తోందని మేఘన ఆరోపించారు. తాను ఎవరినైనా కలిస్తే రాజకీయంగా ఎవరో నడిపిస్తున్నారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన వద్ద ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతానని చెప్పారు.
మేఘన తండ్రి అనంతకృష్ణ గౌడ్ కూడా జోగి రమేష్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమది రాజకీయ కుటుంబం కాదని, వ్యాపార కుటుంబమని చెప్పారు. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, తన కుమార్తె జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. రాజీవ్‌కు ఉన్న సమస్యలు ముందే తెలిసి ఉంటే ఎందుకు వివాహం చేశారో జోగి రమేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించేందుకు తాము పలుమార్లు ప్రయత్నించినా సానుకూల స్పందన రాలేదన్నారు.
పెళ్లయిన కొద్దికాలానికే విడాకుల పిటిషన్ దాఖలు చేయడం వారి వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. తన కుమార్తెకు న్యాయం చేసి ప్రశాంతమైన జీవితం కల్పించాలని అనంతకృష్ణ గౌడ్ కోరారు. న్యాయం జరగకపోతే జోగి రమేష్ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తామని, అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ను కలిసి న్యాయం చేయాలని కోరతామని తెలిపారు.








