రాష్ట్ర ప్రభుత్వ నియామక పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలపై ఝార్ఖండ్ విద్యార్థులు చేస్తున్న నిరసనలను పరిష్కరించాలని కోరుతూ, ఆగస్టు 14న సీఎం సోరెన్‌కు రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఝార్ఖండ్‌లో అధికారంలో ఉన్న జేఎంఎం (ఝార్ఖండ్ ముక్తి మోర్చా) పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది.

విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవని, వారు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారని రాహుల్ లేఖలో పేర్కొన్నారు. పేపర్ లీక్‌లు, విద్యా వ్యవస్థలో అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. భారత విద్యా వ్యవస్థను ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్), బీజేపీ తమ గుప్పిట్లో పెట్టుకుని విద్యార్థుల అణచివేతకు వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

విద్యార్థులతో చర్చించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాహుల్ అన్నారు. అయితే, కొన్ని డిమాండ్లపై ప్రభుత్వం, విద్యార్థుల మధ్య అంగీకారం కుదిరినా, నిరాహార దీక్షలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. సీఎం స్వయంగా విద్యార్థి ప్రతినిధులతో సమావేశమైతే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే నమ్మకం పెరుగుతుందని ఆయన సూచించారు.

దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని, ఈ సంక్షోభ సమయంలో విద్యార్థులకు పూర్తి సంఘీభావం తెలపాలని రాహుల్ కోరారు. విద్యార్థుల వాదనలను వినేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సోరెన్‌ను కోరారు.