కేంద్ర ప్రభుత్వం 2025 ఏడాదికి సంబంధించి జాతీయ క్రీడా పురస్కారాల జాబితాను విడుదల చేసింది. ఇందులో 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు, అలాగే జీవిత సాఫల్య పురస్కారాలు, ద్రోణాచార్య అవార్డులను ప్రకటించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని కమిటీ ఈ విజేతలను ఎంపిక చేసింది. ఈ కమిటీలో గగన్ నారంగ్, అపర్ణా పోపట్, ఎంఎం సోమయ సభ్యులుగా ఉన్నారు.

అర్జున అవార్డు అందుకునే వారిలో పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ, ధనుష్ శ్రీకాంత్, దివ్య దేశ్​ముఖ్, విదిత్ గుజరాతీ, తేజస్విన్ శంకర్, నరేందర్ బెర్వాల్, రాజ్​కుమార్ పాల్ ఉన్నారు. వీరితో పాటు ప్రియాంక గోస్వామి, ఏక్తా భైయాన్, రుద్రాంశ్​ ఖండేల్వాల్, సుర్జీత్, పూజ, అర్వింద్ సింగ్, అఖిల్ షెరాన్, లాల్రెమ్సియామి, మహ్మద్ అజ్మల్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మాజీ ఫుట్ బాలర్ అరుమైనాయగం అర్జున జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు.

శిక్షకులకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డులను పర్వీర్ సింగ్, ఛోటేలాల్ యాదవ్, నేహా చవాన్ దక్కించుకున్నారు. అలాగే ధర్మేంద్ర యాదవ్, వీరేందర్ కుమార్ ద్రోణాచార్య జీవన సాఫాల్య పురస్కారాలకు ఎంపికయ్యారు. మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఆగస్టు 29న జరిగే క్రీడా దినోత్సవం రోజున వీరందరికీ అవార్డులను ప్రదానం చేస్తారు.

మరోవైపు, రాజస్థాన్ జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో కేరళకు చెందిన కజియా లిజ్ మెజో విజేతగా నిలిచారు. 52 మంది పోటీదారులను వెనక్కి నెట్టి ఆమె 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. వైష్ణవి గణేష్ ఫస్ట్ రన్నరప్‌గా, అనుశ్రీ సతవ్లేకర్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.

వైష్ణవి గణేష్ మిస్ ఇంటర్నేషనల్ ఇండియా–2026 టైటిల్‌ను కూడా గెలుచుకున్నారు. విజేతగా నిలిచిన కజియా లిజ్ మెజో, నవంబర్‌లో ప్యూర్టో రికోలో జరగనున్న 75వ అంతర్జాతీయ మిస్ యూనివర్స్ వేదికపై భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.