టీ20 క్రికెట్‌లో బ్యాటర్ల దూకుడు ముందు బౌలర్లు కనీసం రెండు, మూడు వికెట్లు తీయడమే గొప్పగా భావించే రోజులివి. అయితే, ఈ ఏడాది ప్రారంభమైన యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో బౌలర్లు ఏకంగా ఐదు వికెట్ల ప్రదర్శనలతో సత్తా చాటారు.
ఈ లీగ్‌లో ఐదుగురు బౌలర్లు ఐదేసి వికెట్లు తీసి, ఒకే ఎడిషన్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదైన లీగ్‌గా ETPL రికార్డు సృష్టించింది. గతంలో IPL, బిగ్‌బాష్ లీగ్ (BBL), కరీబియన్ ప్రీమియర్ లీగ్ వంటి ప్రముఖ టోర్నీల్లో కూడా ఒక ఎడిషన్‌లో గరిష్టంగా నలుగురు బౌలర్లు మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు.
ఈ టోర్నీలో ట్రెంట్ బౌల్ట్ (5-24), అన్రిచ్ నోర్జి (5-11), మిచెల్ శాంట్నర్ (5-16), క్రెగ్ యంగ్ (5-21), మైఖేల్ బ్రేస్‌వెల్ (5-12)లు ఐదు వికెట్ల ప్రదర్శనతో బ్యాటర్లను వణికించారు. వీరిలో క్రెగ్ యంగ్ మినహా మిగిలిన నలుగురు బౌలర్లు గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కూడా రాణించిన వారే కావడం గమనార్హం.
బ్యాటర్ల తుఫాన్ ఇన్నింగ్స్‌లతో నిండి ఉండే ఫ్రాంచైజీ క్రికెట్‌లో బౌలర్లు పైచేయి సాధించడం అరుదుగా కనిపిస్తుంది. అటువంటిది ఐదుగురు బౌలర్లు ఒకే టోర్నీలో ఐదు వికెట్ల మార్కును అందుకోవడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.








