జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై నిరసన వ్యక్తం చేస్తూ జేఎల్‌కేఎం నేత దేవేంద్ర నాథ్ మహ్తో తొమ్మిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. వరుసగా ఆహారం తీసుకోకపోవడంతో ఆయన రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఆరోగ్యం విషమించడంతో వైద్యుల సలహా మేరకు పోలీసులు, ఆయన అనుచరులు దేవేంద్ర నాథ్ మహ్తోను రాంచీలోని సదర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జేపీఎస్సీ (JPSC), జేఎస్‌ఎస్‌సీ (JSSC) రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలపై సీబీఐ లేదా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం సోమవారం నిరుద్యోగ విద్యార్థులు చేపట్టిన విధానసభ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాసనసభ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ఆందోళనకారులు తోసివేసే ప్రయత్నం చేయగా, పోలీసులు లాఠీచార్జ్ చేసి, బాష్పవాయువు మరియు వాటర్ క్యానన్లను ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవేంద్ర నాథ్ మహ్తో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే, ప్రభుత్వ నియామక పరీక్షల్లో పారదర్శకత వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆందోళనకారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఉద్యమం జార్ఖండ్ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.







